ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే మద్యం కుంభకోణం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ నేతలకు విజిలెన్స్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని ఆరోపించింది. దీనిపై ప్రత్యేక నైపుణ్యంగల సంస్థ చేత దర్యాప్తు చేయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ అక్రమాలకు విద్యా శాఖ, ప్రజా పనుల శాఖలలోని అధికారుల్లో ఎవరు బాధ్యులో నిర్ణయించాలని చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదికలో కోరింది.












