మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుళ్లు, కుమారుల నివాసాలపై జరుగుతున్న ఐటీ దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ దాడులను రాజకీయ కోణంలో కొందరు చూస్తున్నారని, అది ఏమాత్రం సరికాదని అన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరని అన్నారు. తన కుమారుడ్ని సీఆర్పీఎఫ్ బలగాలు కొట్టాయని, అందుకే ఆస్పత్రిలో చేరారన్న మంత్రి మల్లారెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం సరైనవి కావన్నారు. ఏ అధికారి కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, ఎవర్నీ కొట్టరని స్పష్టం చేశారు.
ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి వెళ్తారని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు వాకింగ్ కూడా చేశారని, నోటీసులు ఇవ్వగానే ఛాతీ నొప్పి వస్తుందా? అని ప్రశ్నించారు. మల్లారెడ్డి తన ఫోన్ ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఫోన్ దాచిపెట్టారంటే ఏదో విషయం వుందని ఇట్టే అర్థమైపోతుందని, అనుమానాలు కూడా వస్తాయని అన్నారు. మల్లారెడ్డి ఏ తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు జంకుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.