అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కేంద్రంగా అమెజాన్ డేటా సెంటర్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఏటా 48 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 2030 వరకూ ఈ కేంద్రంపై 36,300 కోట్ల ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. దేశంలో డిజిటల్ రంగంలో కొత్త ఉద్యోగాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అమెజాన్ డేటా సర్వీసెస్ హామీ ఇచ్చింది. అమెజాన్ 2016 లో తన తొలి డేటా కేంద్రాన్ని ముంబై నగరంలో ప్రారంభించింది. ఇక…రెండో డేటా కేంద్రం హైదరాబాద్ లో ప్రారంభం కావడం విశేషం. ఈ పరిణామాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందినట్లైందన్నారు. ఈ కేంద్రం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు స్టార్టప్స్, ఆవిష్కర్తలకు సేవలు అందిస్తుంది పేర్కొన్నారు. ఇక… కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమెజాన్ డేటా కేంద్రాన్ని స్వాగతించారు. డేటా సెంటర్ కోసం నగరంలోని రెండుచోట్ల కేంద్రాలను నిర్మించింది. హైదరాబాద్ ఫార్మాసిటీ సమీపంలో 48 ఎకరాల్లో రూ.5809 కోట్లతో, షాబాద్ మండలం చందన్‌వెల్లిలో 33 ఎకరాల్లో రూ. 5821 కోట్లతో నిర్మించింది. మొత్తం 81 ఎకరాల్లో నిర్మించిన ఈ రెండు కేంద్రాలపై అమెజాన్ రూ. 11630 కోట్ల పెట్టుబడులు పెట్టింది.