ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు తిహార్ జైలులో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ, ఆయన మసాజ్ కూడా చేసుకుంటున్నారంటూ వార్తలు సంచలనం రేపుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే… మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మంత్రి సత్యేంద్ర జైన్ కు చేస్తోంది ఫిజియోథెరపి కాదని, అది మసాజ్ అని జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఇక… మంత్రికి మసాజ్ చేస్తున్న వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాడని, ఆయనో రేపిస్ట్ అని జైలు అధికారులు ప్రకటించారు. ఆ రేపిస్ట్ పేరు రింకు అని, ఆయనపై పోక్సో చట్టంతో పలు కేసులు కూడా వున్నాయని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా… ఆప్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది. మంత్రి సత్యేంద్ర జైన్ కు ఆరోగ్యం బాగో లేదని, అందుకే ఆయనకు ఫిజియోథెరపి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అది మసాజ్ కాదని చెబుతోంది.
అయితే… ఈ వివాదంపై ఆప్ మంత్రి గోపాల్ రాయ్ ఘాటుగా స్పందించారు. తీహార్ జైలులో జైన్ మసాజ్ కి సంబంధించి 10 రోజులుగా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా జైల్లో ఉన్నప్పుడు గుజరాత్ జైల్లో ఏకంగా ప్రత్యేక గదినే నిర్మించారని..అంతటి స్పెషల్ ట్రీట్మెంట్ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఇప్పుడు డిసెంబర్ 4న ఢిల్లీ ప్రజలు బీజేపీకి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పారు.












