తెలంగాణ కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది. మునుగోడు బైపోల్ లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్న బాధ నుంచి బయటికి రాక మునుపే… మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. బాధగానే కాంగ్రెస్ తో బంధం తెంచేసుకుంటున్నానని ప్రకటించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఘోరంగా వుందని, ఇంతటి క్లిష్ట పరిస్థితిని తానెన్నడూ చూడలేదన్నారు. పార్టీకి చేతి గుర్తు వుండాలని సూచించిన వారిలో తానూ ఒకడినని, అలాంటి పార్టీకి రాజీనామా చేసేస్తున్నానని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ బాగు కోసమే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మరోవైపు అతి కొద్ది రోజుల్లోనే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

 

 

కొన్ని రోజుల క్రిందటే శశిధర్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అయితే… ఈ విషయంపై అడగ్గా…. తన మనుమడి స్కూల్ ఫంక్షన్ కోసమే ఢిల్లీకి వచ్చినట్లు పేర్కొన్నారు. అంతేగానీ బీజేపీలో చేరడం లేదన్నారు. అయితే… ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ కి క్యాన్సర్ సోకిందని ఈ భేటీ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ ఆయన్ను 6 సంవత్సరాల పాటు బహిష్కరించింది. చివరగా… ఆయనే పార్టీకి రాజీనామా చేసేశారు.