హైదరాబాద్ ట్రాఫిక్ ను ఓ క్రమపద్ధతిలో పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ పైనే ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా ద్రుష్టి సారించారు. ఇకపై సిటీలో రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ అన్నారు. అందుకే ఇలాంటి వాహనాలపైనే భారీగా జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు.

రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు 1,700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 రూపాయల వరకూ ఫైన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలను అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అయితే… ఈ రెండు నిబంధనలను ఉల్లంఘిస్తూ… వాహనదారులు ఎవరైనా పట్టుబడితే… ఆ వాహనంపై ఏమైనా చలాన్లు వున్నాయా? అని కూడా పరిగణనలోకి తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు.