తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీరియస్ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని, కవిత పోటీ చేస్తారా? అని సవాల్ విసిరారు. కొట్లాడేందుకు తాము రెడీ అని, ఇదే ఫైనలా; మాట మారుస్తారా? అంటూ అర్వింద్ ఎద్దేవా చేశారు. దాడి సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అమ్మను భయపెట్టించారని, ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిని రాళ్లతో కొట్టారని అర్వింద్ ఆరోపించారు. తమ అమ్మపై దాడి చేసే హక్కు వారికి ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేసిందో లేదో తేలాలన్నారు. ఫోన్ చేసింది నిజం కాబట్టే… కవిత ఇంతలా రెచ్చిపోయారని అర్వింద్ పేర్కొన్నారు. కవితకు అహంకారం బాగా పెరిగిందని, తమపై పెట్టే చీటింగ్ కేసులు తన తండ్రి, సీఎం కేసీఆర్ పై పెట్టాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగ్ అని విమర్శించారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేకు వున్నంత సీన్ ఎమ్మెల్సీ కవితకు లేదని అర్వింద్ అన్నారు.