తెలుగు సినీ వినీలాకాశంలో మహోన్నత నట శిఖరం ఘట్టమనేని కృష్ణ

‘మీనా ‘ యద్దనపూడి సులోచనరాణి రచించిన తెలుగు నవల. అందులో హీరో పేరు కృష్ణా రావు. అ నవల చదువుతుంటే మన కళ్ళముందు నిల్చిన హీరో కృష్ణ. పంచ కట్టుతో తెలుగుదనం ఉట్టిపడే హీరో కృష్ణ. ఒక రైతు అంటే మన కళ్ళముందు నిలిచే రూపం కృష్ణదే. వారు చేసిన సినిమాల్లో పాడిపంటలు, ఇల్లు ఇల్లాలు, పుట్టినిల్లు – మెట్టినిల్లు, పండంటి కాపురం, మాయదారి మల్లిగాడు దేవుడు చేసిన మనుషులు, కురుక్షేత్రం, ఊరికి మొనగాడు ఇద్దరు దొంగలు, అన్నదమ్ముల సవాల్, పల్నాటి సింహం, ఈనాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 300 వందలకు పైగా సినిమాల్లో హీరో గా నటించారు. బాపుగారి దర్శకత్వంలో సాక్షి సినిమా చేశారు. ఇలా వారు చేసిన అన్ని సినిమాలు సంచలనాలే. ఇక గూఢచారి నెంబర్ 1 లో సి ఐ డి గా చేసి మెప్పించారు. మోసగాళ్ళకు మోసగాడు సినిమా మెకన్నా స్ గోల్డ్, గుడ్,బాడ్, అగ్లీ వంటి ఆంగ్ల సినిమాల ప్రేరణతో తీశారు. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్ర లో ఒక మైలు రాయి ఎన్నో సంచలనాలకు ఆద్యులు కృష్ణ. ఇక ఆనాడే పాన్ ఇండియా చిత్రంగా తీసిన సినిమా సింహాసనం. రచయిత మహారధి సంభాషణలు కూర్చిన చిత్రం. తెలుగు, హిందీ భాషల్లో 70 ఎం ఎం లో ఎంతో సాహసోపేతం గా తీశారు. భారీ బడ్జెట్ తో మొక్కవోని ధైర్యం తో తీశారు. సింహాసనం లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. టెక్నీషియన్స్ ను ప్రత్యేకంగా వేరే ఇండస్ట్రీ నుండి తీసుకొచ్చారు. సింహాసనం సినిమాకు సంగీతం కూర్చడం కోసం బప్పీలహరిని ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చారు. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తో ఉన్న విభేదాల కారణంగా రాజ్ సీతారాం ని గాయకుడుగా పరిచయం చేశారు. సింహాసనం సెట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అప్పట్లో ఒక అద్భుతం. 70 రోజుల్లో సింహాసనం సినిమా పూర్తి చేయడం గొప్ప విషయం. 1986, మార్చ్ నెలలో సింహాసనం సినిమా 150 థియేటర్లలో 26 ప్రింట్లతో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విడుదల చేశారు. తెలుగులో కృష్ణతో పాటు జయప్రద, రాధ, మందాకిని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రతిదీ కొత్తగా చేశారు. కృష్ణ ద్విపాత్రా భినయం తో ఈ సినిమా సినీ చరిత్ర లో నిలిచి పోయింది. 24 షీట్ లతో వాల్ పోస్టర్ లు వేయించడం ఈ సినిమాతోనే మొదలయ్యింది.తన మొత్తం ఆస్తిని పణంగా పెట్టి ఈ సినిమా తీశారు కృష్ణ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సింహాసనం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అ తరువాత దేవదాసు సినిమా తియ్యడమే సాహసమైతే, అందులోని పాటలు అన్ని హిట్టే. తెలుగులో ఘన విజయాన్ని సాధించిన ఊరికి మొనగాడు సినిమాని జితేంద్ర హీరోగా హిందీలో తీసి అక్కడ విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీదేవితో హీరో గా 30 సినిమాల్లో నటించడం ఒక రికార్డు.జయప్రదతో కూడా చాలా సినిమాల్లో కలిసి నటించారు కృష్ణ. ఇక స్టూడియో కట్టి చిత్ర రంగాన్ని మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలించి నిలబెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోతారు కృష్ణ. జెంటిల్ మెన్ గానే కాకుండా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు గడించుకున్నారు కృష్ణ. సినిమా జయా పజయాలను ఒకే రకంగా తీసుకోగల గొప్ప వ్యక్తిత్వం కృష్ణది. తన సినిమా సరిగ్గా ఆడుతుందా లేదా ఒకటి, రెండ్రోజుల్లోనే గ్రహించి ఈ సినిమా సరిగా నడవదయ్యా! అని తన మీద తనే జోక్స్ వేసుకునేవారట. తన సినిమా అపజయం పాలైతే ఆ నిర్మాతను పిలిచి ఇంకో సినిమాకి డేట్స్ ఇచ్చి, ఫైనాన్స్ విషయంలో కూడా హామీ ఇవ్వడానికి ముందుకు రావడమే కాకుండా, తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించేవారట. కృష్ణ సినిమాల్లో పాటలు చాలా వరకు సూపర్ హిట్టే. చక్కటి వాచకం కృష్ణ సొంతం. వారి సినిమాల్లో సంభాషణలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటాయి. విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, నిర్మాత, నటుడు, స్టూడియో అధినేత, ముక్కుషూటి మనిషి ఇలా క్లాస్, మాస్ ప్రేక్షకులని మెప్పించిన మంచి మనిషి. అన్నిటికి మించి మంచి దార్శనికుడు హీరో కృష్ణ. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ చాలా పుటలనే మిగుల్చుకున్న గొప్పవ్యక్తి ఘట్టమనేని కృష్ణ.
డాక్టర్ వడ్లమాని కనకదుర్గ

Related Posts

Latest News Updates