ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ మెడికల్ కాలేజీలు రావడానికి మంత్రి హరీశ్ చాలా పని చేశారని మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణధ్యాయమని, మర్చిపోలేని రోజు అని సంతోషం వ్యక్తం చేశారు. ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం గర్వకారణగా వుందని ప్రకటించారు. రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, అందుకోసం రాష్ట్ర వైద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో చాలామంది విద్యార్థులకు అవకాశాలు రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కంటే మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను గణనీయంగా పెంచామన్నారు.
గతంలోనే మనం ప్రభుత్వరంగంలో నాలుగు కళాశాలను స్థాపించుకున్నామని, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో గతంలో నాలుగు ప్రారంభించామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అందులో మెడికల్ ఎడ్యూకేషన్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇవాళ మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రారంభించుకుంటున్నామని అన్నారు. మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదని వ్యాఖ్యానించారు. వీటన్నింటికి కారణం సొంతరాష్ట్రం ఏర్పాటుకావడమేనని ప్రకటించారు. సొంత ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరపమైందన్నారు.
నూతన మెడికల్ కాలేజీలను తరచూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తోపాటు ఆ శాఖ అధికారులు కూడా సందర్శించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. తంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.