సూపర్ స్టార్ కృష్ణ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ రంగంలో ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయనే అల్లూరి, ఆయనే తెలుగు జేమ్స్ బాండ్ అని కొనియాడారు. ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత, అభిమానులు సూపర్ స్టార్‌గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (79) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ‘‘350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా సొంతం చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణదేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’’ అని కేసీఆర్ తెలిపారు.
ఇక… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణ గారు తెలుగు వారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేషఖ కు, కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్నారు. కృష్ణ హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని… ఆయన కుటుంబ సభ్యులకు రేవంత్ తన ప్రగాఢ సానుభూతిని తెలియశారు.
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు వెండి తెర ‘కౌబాయ్’ గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కుటుంబ చిత్రాలు, యువతలో, కార్మికుల్లో స్ఫూర్తిని నింపడం వంటి పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కిషన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.