దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. శ్రద్ధా అనే యువతిని అఫ్తాబ్ అమీన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి… ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేశాడు. మృతదేహం జాడే లేకుండా చేసేశాడు. అంతేకాకుండా ఈ శరీర భాగాలను దాచేందుకు ప్రత్యేకంగా ఓ ఫ్రిజ్ ను కూడా కొన్నాడు. అందులో ఈ భాగాలను దాచి… అర్ధ రాత్రి సమయంలో రోజూ కొన్ని భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో విసిరివేసేవాడు. ఇలా 18 రోజుల పాటు శరీర భాగాలను విసిరేశాడు. రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచాఫ్ వస్తోందని ఆమె సోదరుడి స్నేహితులు చెప్పారు. అనుమానం పెరగడంతో శ్రద్ధా తండ్రి స్వయంగా ఢిల్లీ వచ్చారు. ఫ్లాట్‌కు తాళం ఉండటంతో ఈ నెల 8న మెహ్రౌలీ పోలీసులను ఆశ్రయించారు. శ్రద్ధా తండ్రి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈ నెల 11న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాను ఎలా శ్రద్ధాను చంపి ముక్కలుగా కోసి విసిరేశాడో వివరంగా చెప్పాడు. శ్రద్ధాను చంపిన కత్తితో పాటు ఆమె శరీర భాగాల ఆనవాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంబైలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న శ్రద్ధా కు అఫ్తాబ్ అమీన్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. శ్రద్ధా తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు వారంలో ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఫ్లాట్‌లో కలిసి ఉండటం ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా అడుగుతుండటం నచ్చని అఫ్తాబ్ ఆమెను అంతమొందించాలనుకున్నాడు. ఇదే విషయంపై ఈ ఏడాది మే 18న ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది. ఆ రోజే శ్రద్ధాను చంపేసిన అఫ్తాబ్ ఆ తర్వాత ఆమెను 35 ముక్కలుగా కోశాడు.












