తెలంగాణలోని గ్రానైట్ వ్యాపారులపై చేసిన దాడులపై ఈడీ అధికారికంగా స్పందించింది. పలు గ్రానైట్ కంపెనీల కార్యాలయాలు, యజమానుల నివాసాలపై దాడులు చేశామని, ఈ సోదాల్లో 1.08 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు ప్రకటించారు. 10 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, సోదాల సందర్భంగా బినామీ బ్యాంకు ఖాతాలను కూడా గుర్తించినట్లు ఈడీ తెలిపింది.
ఈ నెల 9,10 తారీఖుల్లో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, ఎస్వీజీ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీతో పాటు వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు చేశామని ఈడీ పేర్కొంది. చైనా, హాంకాంగ్ కు చెందిన కంపెనీల పాత్రపై కూడా ఆరా తీశామని, ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించామని ఈడీ తన ప్రకటనలో తెలిపింది.