రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా వెళ్లి, పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె ఇక్కడి గ్రాండ్ రోడ్‌లో దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి చరిత్ర సృష్టించారు. పూరికి చేరుకున్న ఆమె తన కాన్వాయ్‌ను బాలాగండి ఛాక్ వద్ద నిలుపుదల చేశారు. అక్కడి నుంచి సాధారణ భక్తురాలిగానే వెళ్లారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం ఒడిశాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె భువనేశ్వర్ చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్నాథుని దర్శనానికి పూరికి వచ్చారు. రాష్ట్రపతికి పూరి రాజు గజపతి మహారాజ దివ్యసింగ్ దేవ్, ప్రధాన అర్చకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముర్ము 15 నిమిషాల పాటు ధ్యానం చేసుకున్నారు.












