తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన సందేహాల్ని తీర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ వెళ్లి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. మంత్రితో పాటు పలువురు అధికారులు కూడా వున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కొన్ని అంశాలను తెలియజేశారు. బోర్డు ద్వారా రిక్రూట్ మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. నిష్పాక్షిక పద్ధతిలో వీలైనంత తొందరగానే రిక్రూట్ మెంట్ ను చేపట్టాలని గవర్నర్ సూచించారు.

నియామకాల్లో రిజర్వేషన్ల అమలు, యూజీసీ నిబంధనలు పాటిస్తున్నారా ? లేదా ? సెలక్షన్ ప్రాసెస్, న్యాయపరమైన ఇబ్బందులపై మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఆధారంగానే నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని గవర్నర్ స్పష్టం చేసినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనలను పరిష్కరించడం అవసరమని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లను మెరుగుపర్చడం, విద్యా సంస్థల్లో ల్యాబొరేటరీ సౌకర్యాల పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. యూనివర్సిటీల్లో లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్ వనరులు, ఇతర మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.