ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీలలో దక్షిణాదిన  కర్ణాటక, తమిళనాడులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో రూ. 20,000 కోట్ల పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లను జాతికి అంకితం చేయడంతో,  వివిధ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో రూ 10,500 కోట్లు, తెలంగాణాలో రూ 9,500 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టనున్నారు.
నవంబర్‌ 11న ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీ (విధాన సౌద్‌)లో సన్యాసి కవి కనక దాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు.
ఆంధ్ర ప్రదేశ్ లో …. 

నవంబర్‌ 11 సాయంత్రం విశాఖపట్నంకు చేరుకొని, 12న ఉదయం 10:30 గంటలకు బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణాలోని రామగుండంలో ఉన్న ఆర్‌ఎఫ్‌సిఎల్‌ ప్లాంట్‌ను ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ  ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో రూ.3,750 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రారుపూర్‌-విశాఖపట్నం ఎకనామిక్‌ కారిడార్‌లో ఏపి విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. విశాఖపట్నంలోని కాన్వెంట్‌ జంక్షన్‌ నుండి షీలా నగర్‌ జంక్షన్‌ వరకు ప్రత్యేక పోర్ట్‌ రోడ్డుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది విశాఖపట్నం నగరంలో స్థానిక, ఓడరేవుకు వెళ్లే వస్తువుల ట్రాఫిక్‌ను వేరు చేయడంతో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తుంది.

 

శ్రీకాకుళం-గజపతి కారిడార్‌లో భాగంగా రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఎన్‌హెచ్‌-326ఎలోని నరసన్నపేట నుండి పాతపట్నం సెక్షన్‌ను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు. ప్రాజెక్ట్‌ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒఎన్‌జిసి యు-ఫీల్డ్‌ ఆన్‌షోర్‌ డీప్‌ వాటర్‌ బ్లాక్‌ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తారు.

దీనిని  రూ.2,900 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. రోజుకు దాదాపు 3 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్‌సిఎండి) గ్యాస్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్ట్‌ లోతైన గ్యాస్‌ ఆవిష్కరణ ఇది. దాదాపు 6.65 ఎంఎంఎస్‌సిఎండి సామర్థ్యంతో గెయిల్‌ శ్రీకాకుళం అంగుల్‌ సహజ వాయువు పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2,650 కోట్లకు పైగా వ్యయంతో 745 కిలోమీటర్ల పొడవున ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు.

దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధికి ప్రధాని మోదీ  శంకుస్థాపన చేయనున్నారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్‌ రోజుకు 75,000 మంది ప్రయాణీకులను అందిస్తుంది. ఆధునిక సౌకర్యాలను అందించడంతో ప్రయాణీకుల అవసరాలను మెరుగుపరుస్తుంది.

 

తెలంగాణాలో…. 

తెలంగాణలో ప్రధాని మోదీ రూ.9,500 కోట్లపైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. రామగుండం ప్లాంట్‌ ఏడాదికి 12.7 ఎల్‌ఎంటి దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది. రూ.6,300 కంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్‌ఎఫ్‌సిఎల్‌కు అప్పగించారు.

 

దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.2,200 కోట్లకు పైగా వ్యయంతో ఎన్‌హెచ్‌-765డిజి మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌, ఎన్‌హెచ్‌-161బిబి బోధన్‌-బాసర్‌-భైంసా విభాగం, ఎన్‌హెచ్‌-353సి సిరోంచ నుండి మహదేవ్‌పూర్‌ సెక్షన్‌కు సంబంధించిన వివిధ రోడ్డు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.