నోట్ల రద్దు నిర్ణయం పెద్ద తప్పు అని ప్రధాని మోదీ ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశారన్నారు. ప్రజల జీవితాలను తారుమారు చేశారని మండిపడ్డారు. 2016, నవంబర్‌‌ 8న మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విఫల ప్రయత్నం అన్నారు. బ్లాక్‌‌ మనీ వెలికితీత, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం, టెర్రరిస్టులకు నిధులు వెళ్లకుండా ఆపడం, డిజిటల్‌‌ ఎకానమీని ప్రోత్సహించడానికే పెద్ద నోట్ల రద్దు అన్న మోడీ సర్కారు మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయిందన్నారు. మంగళవారంతో నోట్ల రద్దు అనే విఫల నిర్ణయానికి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా నోట్ల రద్దు దుష్ఫలితాలను కేటీఆర్‌ గుర్తు చేశారు. వాటికి బాధ్యత వహించని ప్రధానిపై మండిపడ్డారు.

 

 

నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన ఘోర వైఫల్యమని, ప్రధాని చెప్పిన ఒక లక్ష్యం కూడా నెరవేరని ఆర్థిక వైపరీత్యం అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో సుమారు రూ.30.88 లక్షల కోట్ల నగదు ప్రజల వద్ద ఉండటంతో నోట్ల రద్దుపై నాడు బీజేపీ చెప్పినవన్నీ అసత్యాలేనని తేలిపోయిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత.. 2017 జనవరి నాటికి రూ.17.97 లక్షల కోట్లు చలామణిలో ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం అది 72% పెరిగి రికార్డు స్థాయిలో 30.88 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. నోట్ల రద్దు తరువాత అదనంగా రూ.12.91 లక్షల కోట్ల నగదు కొత్తగా చలామణిలోకి వచ్చిందని తెలిపారు.