మునుగోడు బైపోల్ లో తాను ఓడిపోయినా.. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో వుంటానని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశాని, అధిష్ఠానం ఈ విషయాన్ని గుర్తించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై కచ్చితంగా చర్యలు వుంటాయన్న విశ్వాసం వుందని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. మునుగోడు బైపోల్ ఫలితాల తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కేవలం డబ్బు, మద్యం పంచి టీఆర్ఎస్ ఎన్నికల్లో విజయం సాధించిందని ఆమె ఆరోపించారు.
తాను సీఎంను కలిసినట్లు తన ఫొటో మార్ఫింగ్ చేసి తనను ఓడించారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలూ ధన బలం, మద్యం పంచి, ప్రలోభాలు చేసి, ఓటర్లు బెదిరించారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ కూడా తన విధిని సక్రమంగా నిర్వర్తించలేదని మండిపడ్డారు. ఇంత అనైతిక రాజకీయాలను తానెప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలిపి రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తుందని పాల్వాయి స్రవంతి అన్నారు.