కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. అక్టోబర్ 23 న కర్నాటక నుంచి తెలంగాణలోని మక్తల్ లో భారత్ జోడో యాత్ర అడుగు పెట్టింది. నేటితో కామారెడ్డి జిల్లాలో ఈయాత్ర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద లక్ష మందితో ముగింపు సభను నిర్వహిస్తోంది. 5 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రజలను, శ్రేణులను తరలిస్తున్నారు. కొన్ని జిల్లాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా జన సమీకరణ చేయాలని పీసీసీ ఆదేశించింది. ‘‘భారత్ జోడో గర్జన’’ పేరుతో లక్ష మందితో ఈ సభను తలపెట్టారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుతగిన సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభతో తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర పూర్తవుతుంది.

తదనంతరం రాహుల్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. నాందేడ్ జిల్లాలోని దేగలూరు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. జ్యోతులతో రాహుల్ కు స్వాగతం పలుకుతామని మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రకటించారు. రాత్రి 7:30 కి డేగలూరు చేరుకుంటుందని, 9 గంటల నుంచి వన్నాలి వరకూ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పేర్కొంది.