కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సంఘం అధ్యక్షులు వరప్రసాద్, ఇతర బీసీ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి ఓబీసీలకు చెందిన 15 డిమాండ్లపై  చర్చలు జరిపారు. అసంఘటిత రంగ కార్మికులైన బీసీ చేతివృత్తిదారులు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు బీసీ విద్యార్థులకు సాలర్‌షిప్‌ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.  విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం మాత్రమే ఉన్న రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని వారు కేంద్రమంత్రిని కోరారు.

దశాబ్దాలుగా బీసీలకు ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో అవకాశాలు కోల్పోతున్నారని, వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. బీసీల అభివృద్ధికి కేంద్రం రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2 లక్షల 70 వేల బీసీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కృష్ణయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.