కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే తాము ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం కాలేరన్న భయంతోనే చిల్లర, జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగానే అధికారంలోకి వస్తామని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 100 కోట్లు కాదు 100పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనరని ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.

 

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఆ పార్టీ నేతలది కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా వీడియోలో ఎక్కడా లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అంత బలహీనంగా వుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఊహాజనితమైన ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని, స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? అని ప్రశ్నించారు. తన అసహనం, ఆక్రోశం, అభద్రతా భావాన్ని మరోసారి ఏకరువు పెట్టారని ఎద్దేవా చేశారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్చుకునే అలవాటు టీఆర్ఎస్ కు వుందని, బీజేపీకి ఆ కల్చర్ లేదని స్పష్టం చేశారు. ఫాంహౌస్ ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు.