సీనియర్ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి (92) (జీఎస్ వరదాచారి) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వరదాచారి మరణం పట్ల సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

వరదాచారి 1932లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జన్మించారు. డిగ్రీ అనంతరం ఉస్మానియా వర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశారు. 1954లో జర్నలిజంలోకి అడుగుపెటి ‘హిందూ’ పత్రికలో ఇంటర్న్‌షిప్ చేశారు. అనంతరం అందులో ఉద్యోగ అవకాశం వచ్చినా, తెలుగు పత్రికల వైపే మొగ్గు చూపారు. 1956లో ‘ఆంధ్రజనత’లో చేరారు. 1957లో జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వరదాచారి 1982-88లో ఈనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. 1980లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించారు. వరదాచారి.. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికలకు సుదీర్ఘకాలం ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు.
వ్యక్తిగతంగా వరదాచారి మృదు స్వభావులే. చెప్పాలనుకున్న దానిని సూటిగా, మృదువుగా చెప్పేవారు. మాట కూడా అలాగే వుండేది. చాలా మందికి జర్నలిజం బోధించి, ఉత్తమ, నైతిక విలువలు కలిగిన జర్నలిస్టులుగా తయారు చేశారు. ‘ఇలాగేనా రాయడం’, ‘దిద్దుబాటు’, ‘మన పాత్రికేయ వెలుగులు’, ‘వరద స్వరాక్షరి’ వంటి యువ పాత్రికేయులకు ఉపయుక్తమయ్యేవి ఇందులో ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీకి ‘ఆంధ్రజ్యోతి’ వ్యవస్థాపక ఎడిటర్ ‘నార్ల వెంకటేశ్వరరావు’ మోనోగ్రా్‌ఫను అందించారు. ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట అక్షరీకరించారు. వరదాచారికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘నార్ల జీవన సాఫల్య పురస్కారం’ప్రదానం చేసింది.







