బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు మునుగోడు ప్రజలను భయపెడుతున్నారన్న సమాచారం అందుకున్న బండి సంజయ్… మునుగోడుకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో మూసారాం బాగ్ చౌరస్తా వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హైవేపై బారికేడ్లు, పోలీసు వాహనాలను నిలిపేసి, బండి సంజయ్ మునుగోడుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు హైవేపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. అంతేకాకుండా హైవేపైనే బైఠాయించారు.

 

దీంతో 1:45 ప్రాంతంలో హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు బండి సంజయ్ తో పాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మునుగోడులో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము చూస్తుంటే… టీఆర్ఎస్ స్థానికేతర నేతలు అక్కడ ఎందుకు వున్నారని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మునుగోడులోనే మకాం వేశారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, మంత్రులు ,ఎమ్మెల్యేలు మునుగోడులోనే వున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.