ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు దిగజారాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. పథకం ప్రకారం తన కాన్వాయ్ పైన దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పలివెల గ్రామంలో తన సతీమణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని, తామెప్పుడైనా అలా చేశామా? అని ప్రశ్నించారు. తాము సహనంతో, ఓపికతో అక్కడి నుంచి వెళ్లిపోతుంటే టీఆర్ఎస్ వాళ్లు కావాలనే దాడి చేశారని మండిపడ్డారు. అసలు భౌతికంగా లేకుండ చేయాలని ఏమైనా చేస్తున్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

ఆయా పార్టీలు తమ సిద్ధాంతాలు, మేనిఫెస్టోతో ఓట్లు అడుగుతాయని, దౌర్జన్యం చేసి అడగవని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఖరీదైన ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరే బయటికి వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేవాళ్లమని ఇప్పుడు ఆ వాతావరణమే లేదని విమర్శించారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరహక్కులను కాపాడటంలో, పోలీసు సిబ్బందిని కాపాడటంలో డీజీపీ ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు.