తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వున్న ఓ లేఖ తెగ వైరల్ అవుతోంది. అక్టోబర్ 31 వ తేదీనే ఈ లేఖ రాసినట్లు అందులో వుంది. అయితే… దీనిపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దొంగ పాస్ పోర్టులు తయారు చేసిన వాడికి ఫోర్జరీ లేఖలు తయారు చేయడం పెద్ద కష్టం కాదని సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా అట్టర్ ప్లాఫ్ కావడంతో టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు ఫోర్జరీ లేఖను రిలీజ్ చేశారని మండిపడ్డారు.

 

 

ఎంత మంది ఎన్ని చేసినా… మునుగోడులో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి, ఇలాంటి ఫేక్ లెటర్లను తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. అయినా కూడా.. ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు. ఫోర్జరీ లేఖ విషయంలో ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ పేర్కొంది.