టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ స్నేహితులేనని, ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులుగా అవతారం ఎత్తుతారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నో సందర్భాల్లో ఆ పార్టీలు కలిశాయని, కేసీఆర్ ఫోన్ చేసిన మరు క్షణమే ప్రధాని స్పందిస్తారని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన మీటింగ్ లో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోడీ లైన్ లోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ లో బీజేపీ తీసుకొచ్చే ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ ఏదైనా అంశాన్ని లేవనెత్తితే మాత్రం.. టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తారని అన్నారు.

 

ఇక… దేశంలో యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, ఇంజనీరింగ్ చేసిన వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎయిర్ పోర్టులు, ఎల్ఐసీ, టెలికాం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం తక్కువ ధరకే అమ్మేస్తోందని మండిపడ్డారు. కేవలం ఇద్దరు, ముగ్గురు పెట్టుబడిదారులకు లబ్ది చేకూర్చే విధంగా కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీగా ఉన్నాయన్నారు. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలపై ఇప్పుడు మోడీ ప్రస్తావించరని విమర్శించారు. చిన్నపాటి వ్యాపారస్తులు, రైతులకు రుణాలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.