అధికార టీఆర్ఎస్ బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నాయని, టీఎన్జీఓ నేతలైన మనిల రాజేందర్, శ్రవణ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ థామస్ టీఆర్ఎస్కు ఓటేసేలా మునుగోడులోని ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

 

 

ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చుగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నగదు లావాదేవీలకు సంబంధించి అక్రమ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.