మునుగోడు బై పోల్ వేళ మంత్రి జగదీశ్ రెడ్డికి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు రాత్రి 11 గంటల వరకూ సాగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తిరుమల్‌నగర్‌ కాలనీలో మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి ఆరు వాహనాల్లో వచ్చిన 20 మంది ఐటీ అధికారులు.. పెద్దఎత్తున సోదాలు, తనిఖీలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో.. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో మొత్తం రూ. 49 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేసినట్లు సమాచారం.

 

 

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. అయితే… జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నగదు దాచిపెట్టారని వారికి ఫిర్యాదు అందింది. దీంతో హైదరాబాద్ కి చెందిన ఐటీ అధికారులు పీఏ ఇంట్లో సోదాలు చేసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, డైరీలను ఐటీ స్వాధీనం చేసుకుంది.