మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరని చెప్పారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు. చండూరులో ఆదివారం నిర్వహించిన సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు బీజేపీ డీఎన్‌ఏగా మారిపోయిందన్నారు.

 

సీఎం కేసీఆర్‌ సభ ప్రజాభిమానాన్ని చాటిచెప్పిందని, మునుగోడులో గెలుపు ముమ్మాటికీ ఖాయమైందని జోస్యం చెప్పారు. పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని చెప్పారు. మీరు విలీనం చేసుకోవచ్చుకానీ తాము అదేపని చేస్తే తప్పా అని నిలదీశారు. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే తప్పులేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.

 

పాయింట్- 5 ఎఫ్‌ఆర్‌బీఎమ్ నిధులు ఇవ్వాలంటే మోటార్లకు మీటర్లు పెట్టాలని షరతు పెట్టారని… పాయింట్- 5 అంటే ఏడాదికి 6 వేల కోట్లు.. ఐదేళ్ళకు 30 వేల కోట్లు ఇస్తారని చెప్పారు. మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు పెట్టే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల కోసం 30 వేల కోట్లు కేసీఆర్ వదులుకున్నారని తెలిపారు. రెండేళ్లలో కలిపి కేంద్రం రూ.12 వేల కోట్లను ఆపిందని హరీష్‌రావు చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును లెక్కచేయడం లేదన్నారు. రూ.1900 కోట్లు ఇవ్వాలంటే 19 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.