గుజరాత్ లో బ్రిడ్జి కూలిన మోర్బి ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించనున్నారు. ఈ మేరకు గుజరాత్ సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 1 గంటలకు ఆయన మోర్బీకి చేరుకుంటారు. గాయపడిన వారితో ప్రధాని సంభాషించనున్నారు. ఆ తర్వాత సీఎం పటేల్, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సంఘటనపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఛఠ్ పూజ సందర్భంగా 500 మందికి పైగా ప్రజలు పురాతనమైన మోర్బీ బ్రిడ్జిపై వచ్చారు. కాసేపటికే ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఇప్పటి వరకు 133 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 3 ప్లాటూన్ల ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, భారత నౌకా, వైమానిక దళ, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి దాదాపు 150 మంది ప్రాణాలు కాపాడినట్టు సమాచారం. చీకటి కారణంగా సహాయకచర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ బ్రిడ్జి మరమ్మతులన్నీ పూర్తి చేసి కిందటివారమే పునరుద్ధరించామని, ఇంతలోనే ఇలా జరగడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని… దీనికి బాధ్యత తామే తీసుకుంటున్నామని గుజరాత్ మంత్రి బ్రిజేష్ మిశ్రా అన్నారు.












