త్వరలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా, విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయని పేర్కొన్నారు. భారత వాయుసేనకు అవసరమైన సి-295 రవాణా విమానాల తయారీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ గుజరాత్ లో శంకు స్థాపన చేశారు. ఐరోపా విమాన ఉత్పత్తి సంస్థ ఎయిర్‌బస్, టాటా గ్రూపు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఆత్మ నిర్భర భారత్ కు రక్షణ, విమానయాన రంగాలు ముఖ్యమైన మూల స్తంభాలని అభివర్ణించారు.

భారత్ కొత్త మైండ్‌సెట్‌తో, నవీన పని సంస్కృతితో ముందడుగు వేస్తోందని మోదీ అన్నారు. ‘మేకిన్ ఇండియా.. మేక్ ఫర్ వరల్డ్’ అన్న మంత్రంతో తన సామర్థ్యాన్ని చాటుతోందని తెలిపారు. భారత రక్షణ గగనతల రంగంలో రూ.21,935 కోట్ల భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తయారీ రంగానికి భారీగా ఊతమిచ్చాయన్నారు. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, యూపీ, తమిళనాడులో ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లు అందుకు దోహదపడతాయని మోదీ వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా వున్న మూడు దేశాల సరసన భారత్ కూడా చోటు సంపాదిస్తుందని మోదీ ప్రకటించారు.












