గుజరాత్ మోర్బీ ఘటన : 132 కి చేరిన మృతుల సంఖ్య.. రంగంలోకి సైన్యం

గుజరాత్ లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై గల తీగల వంతెన కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ 132 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు సైన్యం, వాయుసేన కూడా రంగంలోకి దిగింది. ఇప్పటి వరకూ 177 మందిని రక్షించామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక… ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు గల్లంతైన వారికి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే… సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూలిపోవడంతో రక్షణ చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. బ్రిడ్జి కూలే సమయానికి దానిపై 500 మంది ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. నదిలో పడిపోయిన కొందరిని కాపాడి సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సంగతి తెలియగానే రాష్ట్ర విపత్తు సహాయక దళాలు, అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

 

తామే బాధ్యత తీసుకుంటున్నాం : గుజరాత్ ప్రభుత్వం ప్రకటన

ఈ దుర్ఘటన గురించి తెలియగానే గుజరాత్‌ హోం మంత్రి హర్ష్‌ సంఘ్వీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ బ్రిడ్జి మరమ్మతులన్నీ పూర్తి చేసి కిందటివారమే పునరుద్ధరించామని, ఇంతలోనే ఇలా జరగడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని… దీనికి బాధ్యత తామే తీసుకుంటున్నామని గుజరాత్‌ మంత్రి బ్రిజేష్‌ మిశ్రా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు.

230 మీటర్ల పొడవుండే ఈ తీగల వంతెన చాలా పాతది కావడంతో తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆరునెలల క్రితం దీన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహించారు. గుజరాతీల ఉగాది సందర్భంగా అక్టోబరు 26న పునరుద్ధరించి.. మళ్లీ ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారు. ఆరునెలల తర్వాత తెరవడం, ఆదివారం కావడంతో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. బ్రిడ్జిపై అధిక సంఖ్యలోకి ప్రజలు రావడం, చాలా పురాతనమైనది కావడంతో బ్రిడ్జి కూలినట్లు తెలుస్తోంది.

 

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఇక.. ప్రధాని నరేంద్రమోదీ మోర్బీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోందని, బాధితులకు అండగా ఉంటామని ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు పీఎంవో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్‌ ప్రకటించారు.

 

Related Posts

Latest News Updates