నక్సలిజం ఏ రూపంలో వున్నా దానిని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు గన్స్ పట్టుకోగలరని, పెన్నులు కూడా పట్టుకోగలరని అన్నారు. ఇలా చేస్తూ దేశ యువతను నక్సల్స్ తప్పుదోవ పట్టిస్తారని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ వేదికగా జరుగుతున్న రాష్ట్రాల హోంమంత్రుల చింతన్ శిబిర్ ని ఉద్దేశించి మోదీ వర్చువల్ గా మాట్లాడారు. నక్సల్స్ కి సంబంధించిన విధానాలను డీల్ చేయడానికి రాష్ట్రాలు నిపుణులను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. నిరంతరం చట్టాలు, రాజ్యాంగం అంటూ నక్సల్స్ మాట్లాడుతూ.. ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తారని, అలాంటి వారిని వెంటనే పోలీసులు గుర్తించాలని సూచించారు. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. నేరాలను అరికట్టేందుకు కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నామని తెలిపారు. 5 జీతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్న ప్రధాని… క్రిమినల్స్ కంటే 10 అడుగులు ముందు ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాలు కలిసి పోరాడి నేరాలను అరికట్టాలన్నారు.












