టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మొయినాబాద్ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతోనైనా లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మొయినాబాద్ ఘటన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత? ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను ఎందుకు బయటపెట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దొరికిన డబ్బు ఎమ్మెల్యేల నుంచి వచ్చిందా? లేదా కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి వచ్చిందా? అని నిలదీశారు. ఫాం హౌస్ కు డబ్బులు తెచ్చుకుంది, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా..? అని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తమకు వచ్చే లాభం ఏంటన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాదరణ ఉన్న నాయకులా…? అని ప్రశ్నించారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇలాంటి జిమ్మిక్కులు చేసిందని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా చేస్తోందని ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపులను టీఆర్ఎస్సే ప్రోత్సహిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే పార్టీ ఫిరాయించిన వారికి పెద్ద పీట వేసింది కూడా టీఆర్ఎస్సేనని విమర్శించారు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకున్నది టీఆర్ఎస్ కాదా? చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా అలాగే మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ ది కాదా? అంటూ ధ్వజమెత్తారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన పార్టీలోకి చేర్చుకున్నారని నిలదీశారు. మునుగోడులో ఓడిపోతున్నారని తెలిసే… ఇలాంటి నాటకాలని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.







