టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలంగాణలో పెద్ద సంచలనం రేపుతోంది. తాము పార్టీ మారితే 100 కోట్లతో పాటు కాంట్రాక్టులు ఇస్తామంటూ కొందరు ప్రలోభాలు పెట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగానే స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ కు ఓటమి తప్పదని తెలియటంతో బీజేపీని బదనాం చేసేందుకు రెండు టీవీ చానళ్లతో కలిసి సీఎం కేసీఆర్‌ నీచమైన డ్రామాకు తెర తీశారని ఆరోపించారు.

 

కేసీఆర్‌కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్‌హౌ్‌సలో, హోటల్‌లో, ప్రగతిభవన్‌లో గత వారం రోజులుగా జరిగిన సీసీ ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమే లేదని, ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే… భార్యాపిల్లలతో వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్​ సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.