కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నేడు అధికారికంగా మల్లికార్జున ఖర్గే చేపట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు WC సభ్యులు, ఎంపీలు, PCC అధ్యక్షులు, CLP లీడర్లు హాజరయ్యారు. 24ఏళ్ళ తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈనెల 17న జరిగిన AICC అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లిఖార్జున ఖర్గే గెలిచారు. పార్టీ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ ఖర్గేకు అధికారిక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టే ముందు మల్లిఖార్జున్ ఖర్గే జాతీయ నేతలకు నివాళులర్పించారు. రాజ్ ఘాట్ కు వెళ్ళి మహాత్మాగాంధీ సమాధిపై పూలు చల్లి గాంధీని స్మరించుకున్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమాధి అయిన వీర్ భూమి, ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్ ను కూడా సందర్శించారు. నేతలకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. సోనియాకి, రాహుల్ కి, తనకు ఓటు వేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. పార్టీ పునర్వైభవం కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఓ కార్మికుడి కుమారుడు నేడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. నా పనితో, నా అనుభవంతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా. ఇదే నా మాట అంటూ ఖర్గే పేర్కొన్నారు. బ్లాక్ కమిటీ అధ్యక్షుడిగా 1969 లో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకున్నానని అన్నారు. గాంధీ, నెహ్రూ వంటి వారు మార్గనిర్దేశనం చేసిన పార్టీకి తాను అధ్యక్షుడు కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలను చూసుకోవడం తన బాధ్యత అని ఖర్గే అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికీ సాధికారత లభించే విధంగా… సమాన అవకాశాలు కలిగే భారతాన్ని తాము నిర్మిస్తామని ప్రకటించారు. అందరి హక్కులను తాము గౌరవిస్తామని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇక.. దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిని తాము ఓడిస్తామని ఖర్గే ప్రకటించారు.












