కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు చేపట్టే రోజే విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా చేసేందుకు చివరి నిమిషం వరకూ తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీకి ఛాలెంజ్ విసిరే ఏకైక వ్యక్తి రాహుల్ అని స్పష్టం చేశారు. అయితే…. గాంధీయేతర వ్యక్తే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నది రాహుల్ కోరిక అని, దాని ప్రకారమే జరిగిందన్నారు. అయితే… అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఖర్గేకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నేటితో పార్టీలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు ఇతరులు పాల్గొంటారు. ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపారు. 24 ఏండ్ల తర్వాత ప్రెసిడెంట్ అయిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు.












