మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా కాలం తరవాత కింగ్ కోహ్లీ నుంచి అసలుసిసలు ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని మీమ్స్ నవ్వు తెప్పించడమే కాకుండా విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందులోనూ సినిమా, క్రికెట్ తారలకు సంబంధించిన మీమ్స్ అయితే విపరీతంగా వైరల్ అవుతాయి. ప్రస్తుతం ఒక మార్ఫ్డ్ ఫొటో అలానే వైరల్ అవుతోంది. ఆ ఫొటో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీది. కానీ, ఫొటోలో ఆయన దర్శనం మాత్రం విరాట్ సింహ కోహ్లీ. ఇదేంటనుకుంటున్నారా.. ఏం లేదు, కోహ్లీకి బాలయ్య పూనాడు. నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఆయన 107వ సినిమాకు టైటిల్ ఖరారు చేస్తూ నిన్న పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. అంతేకాదు, మైలురాయిపై కాలుమోపి టీవీగా నిలబడిన బాలయ్య రూపం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మైలురాయికి పదునైన గొడ్డలిని ఆన్చి పెట్టి.. రండిరా చూసుకుందాం అన్నట్టుగా బాలయ్య లుక్ ఉంది. అయితే, ఈ రూపంలోకి విరాట్ కోహ్లీని చొప్పించారు. ‘వీరసింహారెడ్డి’ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి విరాట్ కోహ్లీ రూపంలోకి మార్చిన కొత్త పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్వీట్ చేసింది. ‘‘చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు!’’ అని విరాట్ కోహ్లీ డైలాగ్ చెప్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. కోహ్లీ పేరును కూడా మార్చి.. విరాట్ సింహ కోహ్లీగా రాశారు. ‘వీరసింహారెడ్డి’ పోస్టర్లో గొడ్డలి ఉన్నచోట బ్యాట్ పెట్టారు. మైలురాయిపై ‘పులిచర్ల 4 కి.మీ’ అని రాసి ఉంటే.. దాన్ని తీసి కోహ్లీ స్కోరు 82 నాటౌట్ (53) అని మార్చారు. మొత్తం మీద పాకిస్థాన్ మీద కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ను ఈ విధంగా అభినందించారు. అయితే, ఈ పోస్టర్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి దిశగా వెళ్తున్న జట్టును ట్రాక్‌లో పెట్టడమే కాకుండా.. ఆఖరి వరకు క్రీజులోనే ఉండి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లక్ష్యం 160 పరుగులు కాగా.. అందులో సగానికి పైగా అంటే 82 పరుగులు కోహ్లీవి ఒక్కడివే కావడం గమనార్హం. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా.. తనలో ఇంకా పస అయిపోలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కింగ్ కోహ్లీని జపిస్తోంది.
https://twitter.com/MythriOfficial/status/1583469573265063936
https://twitter.com/StarSportsTel/status/1584171547170078720