మునుగోడులో తాము గెలిస్తే… ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అభివృద్ధిలో అండగా ఉంటానని, రోడ్లను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. తన మాట మీద విశ్వాసం ఉంచండి అని పేర్కొన్నారు. తప్పకుండా అభివృద్ధిలో పయనిద్దామని, మునుగోడును అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని అన్నారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలంటే మోదీ ఇవ్వరు కానీ… రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను అప్పనంగా రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని కేటీఆర్ అభివర్ణించారు. నాలుగేండ్ల పాటు మునుగోడును పట్టించుకోలేదని విమర్శించారు.