నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు NBK 107 చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ఫర్మేషన్ వెళ్లిందని టాక్. 2023 సంక్రాంతి రేసులో చిరంజీవి 154వ చిత్రం వాల్తేర్ వీరయ్య, ప్రభాస్ ఆది పురుష్, కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు సినిమాలున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ కూడా రావటంతో సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారిందని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తలు.బాలకృష్ణకు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోన్న ఈ సినిమాలో మరోసారి నందమూరి హీరో ద్విపాత్రాభినయంలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు గోపీచంద్ మలినేని కథను రాసుకున్నారు. ఇప్పటికే బాలయ్య రోల్‌కు సంబంధించిన లుక్, ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్, ఇందులో కీలక పాత్రలో కనిపించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తోంది. అఖండ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం కావటంతో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా అంటున్నారు. NBK 107 షూటింగ్ పూర్తి కాక ముందే బాలకృష్ణ తన 108 వ సినిమాగా అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్.. స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.