చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందిన వారు ఇతర మతాలకు మారితే, వారికి షెడ్యూల్డు కులం హోదా కల్పించడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. వీరితో పాటు సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ మెంబర్ ప్రొఫెసర్ సుష్మా యాదవ్ ఈ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు.చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందినవారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌లో పేర్కొనని మతంలోకి మారినపుడు, వారికి ఎస్సీ హోదా కల్పించడంపై పరిశీలన జరిపేందుకు త్రిసభ్య కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ కమిషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2 సంవత్సరాల వరకూ అధ్యయనం చేసి, రిపోర్టు సమర్పించాలని కేంద్రం కోరింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 341 ప్రకారం వివిధ సందర్భాల్లో జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఈ అంశాన్ని ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, ప్రస్తుత షెడ్యూల్డు కులాలవారిపై ఎటువంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇతర మతాల్లోకి మారిన వారు కోల్పోతున్నవాటిని, వారిపట్ల సాంఘిక వివక్ష పరిస్థితులు, వారి ఆచార, సంప్రదాయాల్లో మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇప్పటి వరకు హిందూ దళితులు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు లభిస్తున్నాయి.