ఆఫ్గనిస్తాన్ నుంచి పాక్ మీదుగా మన దేశంలోకి తీసుకువస్తున్న హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 200 కిలోల హెరాయిన్ ను ఇండియన్ నేవీ, ఎన్సీబీ అధికారులు సంయుక్తంగా సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి, డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఈ హెరాయిన్ ను ఆఫ్గన్ నుంచి పాకిస్తాన్ కు తరలించి, అక్కడి నుంచి ఇరాన్ పడవలో ఇండియాకు., శ్రీలంకకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఓ పడవలోంచి మరో పడవలోకి డ్రగ్స్ ను మార్చుతున్న సందర్భంలో నేవీ గుర్తించింది.
వెంటనే అప్రమత్తమై.. స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అయితే.. అధికారులు తమను గుర్తించారని తెలుసుకున్న డ్రగ్స్ ముఠా సముద్రంలోకి దూకి, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. హెరాయిన్ ను నీటిలో పడేసేందుకు కూడా ప్రయత్నించారు. చివరికి నేవీ హెరాయిన్ ను, డ్రగ్స్ ముఠాను పట్టుకుంది. దాదాపు ఆరుగురు ఇరాన్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నామని ఎన్సీబీ అధికారులు తెలిపారు.