టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.మహారాష్ట్ర, కర్ణాటకలో తమకు సానుకూల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామితోకలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి రంగంలో విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత్ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు, ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. ఎస్సీలను వ్యాపారవేత్తలను చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న లిబరేషన్ డే అయితే ఆగస్టు 15 ఎందుకు కాదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్‌ను అవహేళన చేసిన వాళ్లంతా చీకట్లో కలిసిపోయారని అన్నారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదని తెలిపారు. మోదీ అండ్ కో వ్యూహాలన్నీ మాకు తెలుసని, వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలు బయటపెడుతామని హెచ్చరించారు. బీజేపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారని విమర్శించారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారని ధ్వజమెత్తారు. ఒక్క బీజేపీ నేతపైనైనా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో చేసిన పనిని దేశానికి చెబుతామన్నారు. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.