సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్నీ బేరీజు వేసుకొని, బలమైన పునాదుల మీదే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భారత్ రాష్ట్రాల సమాఖ్య అని, రాష్ట్రాలు, దేశం కలిసి డెవలప్ అయితేనే.. సమగ్రమైన డెవలప్ మెంట్ సాధ్యమవుతుందన్నారు. దేశ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు తమ మొదటి కార్యక్షేత్రాలని వివరించారు. రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం హోదాలో పర్యటిస్తా…
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక.. తెలంగాణ రాజకీయాలకు తాను దూరమవుతానని కొందరు అంటున్నారని, అలాంటి అనుమానాలే అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ సీఎంగా వుంటూనే దేశమంతా పర్యటిస్తానని, అందులో ఎలాంటి అనుమానాలూ అవసరం లేదన్నారు. తెలంగాణను సాధించుకున్న తక్కువ కాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగు నీరు లాంటి అన్ని రంగాల్లోనూ కొత్త పుంతలు తొక్కుతున్నామని వివరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఏలిన పార్టీలు ఏమీ చేయలేదని, కానీ.. తమ బీఆర్ఎస్ అలా కాదని, తమకు ఓ టాస్క్ అని స్పష్టం చేశారు. బాగా కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసినట్లే.. దేశం కోసం కష్టపడి, అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.
రైతు సంక్షేమమే ప్రధాన అజెండా
రైతు సంక్షేమమే తమ జాతీయ పార్టీ ప్రధాన అజెండా అని కేసీఆర్ ప్రకటించారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుందన్నారు. ఎంతో ఆహార భద్రత వున్న మన దేశం ఇంకా ప్రాసెసింగ్ ఫుడ్ పైనే ఆధారపడటం ఇబ్బందికరమని అన్నారు. వనరులు వుండి కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.