ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 3/5
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,
నటీనటులు: బెల్లంకొండ గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ
విడుదల తేదీ: 05.10.2022
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇద్దరి కొడుకుల్లో ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆయన హీరోగా కమర్షియల్ మాస్, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఇక సురేష్.. రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ తండ్రి బ్యానర్ లో నిర్మాత గా వ్యవహరించేవాడు. ‘స్వాతిముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయం ఐయ్యాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
కథ ఏమిటంటే?
కాకినాడలోని పిఠాపురంలో ఉండే బాలు (బెల్లంకొండ గణేష్) ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తుంటాడు. చాలా మంచి కుర్రోడు. జీవితంలో అమ్మాయిలకు దూరంగా ఉంటూ స్వాతిముత్యం లా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే మనస్తత్వం తనది. ఇంట్లో పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుంటారు. అలా ఓసారి పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ని చూసిన గణేష్‌కి, ఆమె బాగా నచ్చేస్తుంది. భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదువుకుని ఉంటుంది. బెంగుళూరులో జాబ్ వస్తుంది. కానీ ఇంట్లోవాళ్లు ఆ ఉద్యోగానికి పంపరు. దాంతో అదే ఊళ్లోనే ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుంటుంది. ఆమెకు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలని కోరిక. కానీ బాలు వాళ్ల ఫ్యామిలీకి అది ఇష్టం ఉండదు. దాంతో ఆమె బాలుని పెళ్లి చేసుకోనంటుంది. కానీ.. భాగ్యలక్ష్మిని చూడగానే ఇష్టపడ్డ బాలు.. పెళ్లికి అందరినీ ఒప్పిస్తాడు. పెళ్లి రోజు రానే వస్తుంది. అయితే అతనికి శైలజ అనే అమ్మాయి ఫోన్ చేయడంతో పరిస్థితి మారిపోతుంది. ఆమె ఓ పిల్లాడిని తీసుకొచ్చి నువ్వే తండ్రివి అని బాలు చేతిలో పెట్టేసి వెళ్లిపోతుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. అసలు ఏ తప్పూ చేయని బాలు అనుకోకుండా ఓ చిన్నబాబుకి తండ్రి ఎలా అయ్యాడు? అసలు ఎవరీ శైలజ? చివరకు బాలు తన తప్పేం లేదని ఎలా నిరూపించుకున్నాడు.. భాగ్యలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:
అన్న సాయి శ్రీనివాస్ లాగ కమర్షియల్ ఫార్మేట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో కాకుండా బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన పని తాను చేసుకుంటూ పోయే మన పక్కింటి కుర్రాడిలా బెల్లంకొంగ గణేష్ కనిపించారు. లుక్స్ పరంగా తను బావున్నాడు. నటన పరంగానూ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో రెండు కుటుంబాల వారిని ఒప్పించే యువకుడిగా, చేయని తప్పుకు నిందలను భరించినా, తన వల్ల ఓ అభం శుభం తెలియని చిన్న పిల్లాడు అనాథ అయిపోకూడదనే మంచి మనసున్న అబ్బాయిగా బెల్లంకొండ గణేష్ నటన ఆకట్టుకుంటుంది. హీరో ఎలివేషన్ సీన్స్ అనేవి ఎక్కడా కనిపించలేదు. కథానుగుణంగా హీరో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా సహజంగా ఉంది. ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటూనే తనకు కాబోయే వాడిని అర్థం చేసుకున్న అమ్మాయి పాత్రలో వర్ష బొల్లమ్మనటన బావుంది. ఆమె తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. రావు రమేష్, ప్రగతి ఇందులో అబ్బాయి తల్లిదండ్రులుగా కనిపించారు. కన్న కొడుకంటే ప్రేమను చూపిస్తూనే, నాకు అన్ని విషయాలు తెలుసు అనే తండ్రి పాత్రలో రావు రమేష్ నటన సూపర్బ్. పాత్రను ఆయన చేసిన తీరు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ తల్లిదండ్రులుగా నరేష్, సురేఖా వాణి కనిపించారు. అమ్మాయి కట్టుదిట్టంగా పెంచే తల్లిదండ్రులుగా వారు కనిపించారు. సినిమాలో నరేష్ అన్నయ్య పాత్రలో నటించిన గోపరాజు రమణ పాత్ర సినిమాలో కీలకం. ఆయన పాత్రను దర్శకుడు లక్ష్మణ్ ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. గోపరాజు కూడా తన యాక్టింగ్‌తో సెకండాఫ్‌లో నవ్వులు పూయించారు. హీరో ఫ్రెండ్‌గా కనిపించిన వెన్నెల కిషోర్ ఎప్పటిలాగానే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.
సాంకేతిక పరంగా ఎలావుందంటే?
సరోగసీలో స్పెర్మ్ డొనేషన్ అనేది చాలా సెన్సిబుల్ పాయింట్. బయట దాని గురించి మాట్లాడాలంటేనే అందరూ కాస్త తటపటాయిస్తుంటారు. అలాంటిది సినిమా చేయాలంటే … కాస్త ధైర్యమే కావాలి. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందించిన సినిమాయే ‘స్వాతిముత్యం’. గతంలో ఓ చిత్రం ఇలాంటి సెన్సిబుల్ విషయాన్ని తెలుగు ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. మళ్లీ అలాంటి సబ్జెక్ట్ జోలికి ఎవరూ వెళ్లలేదు. కానీ యంగ్ డైరెక్టర్ లక్ష్మణ్ కె.కృష్ణ సీరియస్‌గా కాకుండా ఎంటర్‌టైనింగ్, ఎమోషనల్ కోణంలో స్పెర్మ్ డొనేషన్ అనే పాయింట్ చెబితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘స్వాతిముత్యం’ కథను రాసుకున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వ పనితనం సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సినిమా వ్యవధి కూడా రెండు గంటలు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదైంది. ఫస్టాఫ్ ఎండింగ్‌లో ట్విస్ట్ ఇస్తూ హీరోని సమస్యల్లోకి నెట్టేసే శైలజ అనే పాత్రధారి దుబాయ్ వెళ్లిపోతున్నట్లు చూపించారు. కానీ సెకండాఫ్‌లో ఆమె కనిపిస్తుంది. సమస్యల్లో ఉన్న హీరో, క్లైమాక్స్ ముందుకు వరకు ఎక్కడా బలంగా తన ఓపినియన్ చెప్పే చేసినట్లు కనిపించడు.. ఇక మహతి స్వర సాగర్ సంగీతంలో పాటలు ఓకే. నేపథ్య సంగీతం బావుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది. సూర్య సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే, ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. డెబ్యూ డైరెక్టర్‌ని, సున్నితమైన కథను నమ్మి నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుకు వచ్చి సినిమాను నిర్మించింది.
తీర్పు :
స్వాతిముత్యం అంటూ వచ్చిన ఈ చిత్రం కామెడీగా సాగుతూ అక్కడక్కడా మంచి ఫీల్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే కీలకమైన ఎమోషన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం, అలాగే ఫస్ట్ హాఫ్ కథనం కూడా కొన్ని చోట్ల ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే రావు రమేష్ – గోపరాజు రమణ యాక్టింగ్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఫస్టాఫ్ గొప్పగా లేకపోయినా బోరింగ్‌గా కూడా లేదు. అలా నడిచిపోతుంది. ఇక ట్విస్ట్‌తో ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రలు, సన్నివేశాలు, తదనుగుణంగా వచ్చే కామెడీ ప్రేక్షకుడిని నవ్విస్తాయి. సాఫీగా సరదాగా సాగే ఫామిలీ డ్రామా ‘స్వాతిముత్యం’ చూడొచ్చు.