కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే అని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళలో ముగిసిందని, ఈ నెల 18 న ఏపీలోకి ప్రవేశిస్తుందని జైరాం రమేశ్ ప్రకటించారు. కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ యాత్ర వుంటుందని, 4 రోజుల పాటు 85 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని ప్రకటించారు. అనంతరం తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర సాగుతుందని తెలిపారు.
ఇక మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ప్రత్యేక హోదాపై స్పందించారు. 2024 లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత తమదేనని అన్నారు. ఏపీలో కచ్చితంగా పార్టీ బలపడుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామన్నారు. భారత్‌కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ దాన్ని విచ్ఛిన్నం చేస్తోందని దిగ్విజయ్ మండిపడ్డారు.