“షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్”
మహర్నవమి నాడు దేదీప్య మానంగా వెలిగే, చిద్రూపి అయిన అపరాజిత దేవీ రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు.
నవరాత్రులలో అన్ని రోజులూ పూజలు చేయలేనివారు కనీసం చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి. ఈ మూడు రోజులూ త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి దేవి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో ఉంది. ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘మహర్నవమి’ అంటారు. దుర్గాష్టమి, విజయదశమిలాగే ‘మహర్నవమి’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. ఈ రోజున అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. ఆరాధిస్తారు.
కొందరు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహర్నవమి నాడు ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. మహార్నవమి రోజున ఇతర పిండి వంటలతోపాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిది మంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి, నుదుట కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. తెలంగాణాలో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి ఉద్యాపన చేస్తారు.
ఇక, తన పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు గంగను భువి నుంచి దివికి తెచ్చింది కూడా ఈనాడే. ఇక నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైన నవమి తిథి నాడు మంత్ర సిద్ది కలుగుతుంది. కాబట్టి దీనికి సిద్ధదా అని పేరు. దేవి ఉపాసకులు అంతవరకు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు నిర్వహిస్తారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతాయని నమ్మకం.
”అత్ర అపరాజితా పూజనం సీమోల్లంఘనం శమీ పూజనం దేశాంతర యాత్రార్థినాం ప్రస్థానచ హితం” అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకాలపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తొస్తుంది. వర్షాకాలం పోయి శరద్రుతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కాలం. అందుకే ఆ రోజు అపరాజితను పూజించాలి. అనగా పరాజయం కలుగకుండా దేవిని ఉపాసించాలి. సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం.
విజయకాలంలో బయలుదేరి విజయం సాధించడానికి ఆ సమయంలో సీమోల్లంఘనం చెప్పబడింది. సమస్త దేవతలకు, సమస్త మూర్తులకు అధిష్ఠానియై శ్రీచక్రస్థిత అయినటువంటి ఈ అపరాజిత దేవీ ఉపాసన భవ బంధాలను తొలగించడమే కాకుండా, ఇహపర ముక్తిదాయిని. ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను, భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటటువంటి తత్వం ఈ రూపానిదే. అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు. అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే. ఆ తల్లిని ఆరాదిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం.
బంగారువర్ణ వస్త్రాలతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది.!!
మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు