కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పూట పూటకో మలుపు తిరుగుతున్నాయి. రోజుకో కొత్త నేత అధ్యక్ష ఎన్నికల్లోకి దిగుతానంటూ ముందుకు వస్తున్నారు. అందులోంచి ఒక్క శశిథరూర్ ఇప్పటి వరకూ నిలుస్తూ వచ్చారు. ఆయన నేడు నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్, అశోక్ గెహ్లాట్, మనీశ్ తివారీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్… ఇలా పేర్లన్నీ ముందుకు వచ్చేశాయి. అయితే… అధిష్ఠానం మనసులో ఎవరున్నారో మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. రాహుల్ గాంధీ మాత్రం రేసులో లేరని తేలిపోయింది. పోటీలో ముందున్న గెహ్లాట్ తాను తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే… దిగ్విజయ్ యాక్టివ్ అయ్యారు. తాను కచ్చితంగా బరిలో నిలుస్తానని సోనియాతో భేటీ తర్వాత ప్రకటించారు. నామినేషన్ పత్రాలు కూడా తీసుకున్నారు.
కానీ… నామినేషన్ వేసే కొద్ది గంటల ముందే… తాను బరిలో వుండటం లేదని సంచలన ప్రకటన చేశారు. కొత్త ట్విట్ ఏంటంటే.. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే బరిలోకి రావడం. ఇది అత్యంత ఆశ్చర్యకర పరిణామం. మల్లికార్జున ఖర్గే గాంధీ పరివారానికి అత్యంత సన్నిహితులు. దళిత నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. మధ్యాహ్నం ఖర్గే నామినేషన్ వేయనున్నారు. అయితే.. థరూర్ కంటే.. ఖర్గే వైపే సోనియా మొగ్గు చూపుతారని పార్టీ నేతలు అంటున్నారు.