కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన పథకాలను గుర్తించి, అవార్డులు ఇస్తుంటే.. కేంద్ర మంత్రులు మాత్రం గల్లీల్లో విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మిషన్ భగరీథకు కేంద్రం అవార్డు ప్రకటించిన నేపథ్యంలో హరీశ్ పై వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథకు 30 అవార్డులు వచ్చాయని ఆనందం ప్రకటించారు. తాము ప్రకటించిన మిషన్ భగీరథకు 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందని, కానీ కేంద్రం 19 పైసలు కూడా ఇవ్వలేదని హరీశ్ చురకలంటించారు. మిషన్ భగీరథ అవార్డుతో అయినా… కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలన్నారు. రెండు రోజులకో కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటిస్తూ.. తమ సర్కార్ పై బురద జల్లి వెళ్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.. గల్లీలో రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడాలన్నారు. 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చిన నివేదికలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. గత ప్రభుత్వాల కాలంలో సర్పంచ్‌లు బోర్లు రిపేర్ చేయడానికే పరిమితం అయ్యేవారని గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, కరెంట్ సమస్యలు లేవన్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ తెలంగాణ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకం దేశమంతటా ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.