చల్లారిందనుకున్న రాజస్థాన్ రాజకీయంలో మళ్లీ అగ్గి రేగింది. మళ్లీ సంక్షోభం తలెత్తింది. ఏకంగా 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేశారు. రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ నివాసానికి వెళ్లి మరీ అందజేశారు. ప్రస్తుతం సీఎంగా అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే… ఆయన వర్గీయులకు సీఎం పదవి కట్టబెట్టాలని, అంతేగానీ సచిన్ పైలట్ కు ఇవ్వొద్దని వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను కొన్ని రోజుల నుంచి సీఎం గెహ్లాట్ కూడా చేస్తున్నారు. తాను అధ్యక్షుడైతే… సీఎం పదవి పైలట్ కు దక్కొద్దని, తాను సూచించిన వారికే కట్టబెట్టాలని ఏకంగా సోనియా గాంధీ ముందే తేల్చి చెప్పారు. తదుపరి సీఎంగా సీపీ జోషి లేదా… ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో వున్న గోవింద్ సింగ్ దొటాస్రా ను నియమించాలన్నది గెహ్లాట్ డిమాండ్ .
అంతేకాకుండా సీఎల్పీ భేటీ నిర్వహించి, తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా… అంతకు ముందే గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీని భేటీని కూడా రద్దు చేసి, పరిశీలకులుగా వెళ్లిన వారిని వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించింది.