శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి స‌న్న‌ద్దం…

తొలిరోజు స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం
న‌వ‌రాత్రుల విజయ‌వంతానికి ప‌ది శాఖ‌లు ఏక‌తాటిపై
ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్ ప్ర‌తినిధి కొంకిమ‌ళ్ళ శంక‌ర్‌:- ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం అమ్మ‌ల‌గ‌న్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా పేరును సంపాదించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు. నవరాత్రుల వేళ.. కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా .. జై భ‌వానీ.. జైజై భ‌వానీ నామ‌స్మ‌ర‌ణ‌తో వేడుకునేందుకు రేపటి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలిరానున్నారు. కరోనా తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తిస్థాయి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు చేస్తోన్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్​ ఐదో తేదీ వరకు పది రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత అలంకరణలో మెరిసే కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9 గంటల తరువాతే కల్పిస్తారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని, అక్టోబర్​ రెండో తేదీ అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈఓ ద‌ర్భ‌ముళ్ళ భ్రమరాంబ, సుమారు పది శాఖల అధికారుల ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.వినాయక గుడి నుంచి టోల్‌గేటు ద్వారా ఓం మలుపు వరకు మూడు వరసలు, ఓం మలుపు వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, వీఐపీలకు ఒక్కొక్క క్యూలైను చొప్పున మొత్తం ఐదు వరుసలు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్‌ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. భక్తుల కోసం సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, బాలబోగ నివేదన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తారు. చతుర్వేద పారాయణలు, మహావిద్య, సుందరకాండ, సప్తశతి, చండీనవాక్షరి, బాలమంత్రం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్రహ జపం, లలితా సహస్రనామ పారాణాయాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం గతానికి భిన్నంగా ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానమైన విద్యుత్తు దీపాలంకరణ, లేజర్‌షోలను ఏర్పాటు చేశారు. కృష్ణాతీరం వెంబ‌డి ముందస్తుగా గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతారాణా టాటా వెల్లడించారు. సుమారు 4వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు 12 చోట్ల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడల్‌ అతిథిగృహం వద్ద కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని, 400 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్